Thursday, October 28, 2010

ఎన్.టి.ఆర్ అంటే నాకు అసూయ అందుకే రక్తచరిత్రలో విలన్ గా చూపించా : రాంగోపాల్ వర్మ


క్తచరిత్ర విడుదలకు ముందు తరువాత వర్మ మీడియాలో కనిపించని రోజంటూ లేదు. ప్రతిరోజు ఏదో  ఒక చానెల్లో కనిపిస్తూనే ఉన్నాడు . ఇది చాలా మందికి దొరకని భాగ్యం. అసలు వర్మ మీడియా వెంట పడుతున్నాడో లేక మీడియానే వర్మ వెంట పడుతుందో తెలియనంతగా ఉంది. ఇక రాము ఇంటర్వ్యూలను చూసే /చదివే వాళ్ళకు విచిత్రమైన అనుభూతులు కలుగుతాయి ... ఎందుకంటే రాము చెప్పే సమాధానాలు అలా ఉంటాయి మరి. తను నిజం చెపుతున్నాడో అబద్ధం చెపుతున్నడో తేల్చుకోవడం వంద శాతం కష్టం . ఇక ఇంటర్వ్యూ చేసే  వాడి పరిస్థితి అయితే చెప్పనే అక్కరలేదు. రామూ నుండి ఏ సమాధానమైతే ఆశించి ప్రశ్న అడుగుతాడో  ఆ సమాధానం రామూ నుండి చస్తే రాదు. ప్రతి ప్రశ్నకూ అతని దగ్గర సమాధానం ఉంటుంది ... అది తప్పైనా కావచ్చు రైటైనా కావచ్చు . ఒక్కోసారి ఆ సమాధానాలు వింటే ఎక్కడో కాలుతుంది. ఇదంతా దృష్టిలో పెట్టుకుని నేనే వర్మని ఇంటర్వ్యూ చేస్తే ఎలా ఉంటుందా అని ఒక చిలిపి ఆలోచన వచ్చింది  . దానికి  బ్లాగు రూపమే ఈ పోస్టు. ఒకవేళ ఇవే ప్రశ్నలను సాక్షాత్తు వర్మనే అడిగితే కొంచెం అటుఇటుగా ఇలాంటి సమాధానాలే చెబుతాడని నా అభిప్రాయం . ఇక చదివి చిత్తగించండి 

ప్రశ్న(నేను): హీరోయిన్లను చెల్లెళ్ళుగా భావిస్తానని ఒక సంధర్భంలో మీరే చెప్పారు ...  అటువంటి వాళ్ళను అర్ధనగ్నంగా ఎలా చూపించగలుగుతున్నారు
జవాబు(వర్మ): పూర్తి నగ్నంగా చూపించడం కుదరదు కాబట్టి 

నేను : నరకానికి వెళ్ళాల్సివస్తే ?
వర్మ  : ఆనందంగా వెళతా ... కాకపోతే అక్కడ శ్రీదేవి ఉండాలి.

నేను  : మీరు తీసే సినిమా ఖచ్చితంగా ప్లాపవుతుందని ముందే తెలిస్తే ఏంచెస్తారు ? ...  ఆపేస్తారా  కంటిన్యూ చేస్తారా ?
వర్మ :  (వెంటనే తడుముకోకుండా ) దానికి సిక్వెల్ కూడా ప్లాన్ చేస్తా 


నేను  : పాలిటిక్స్ పై మీ అభిప్రాయం ?
వర్మ : ఏ పని చేతకానివాడు చేసే పనే పాలిటిక్స్

నేను  : సిస్టం అంటే ఎవరు ? 
వర్మ : నేనే ... నా దగ్గర ఎన్నో కళలకు సబంధించిన  వారు పనిచేస్తారు. వాళ్ళందరిని కోఅర్డినేట్ చేసేది నేనే 

నేను  : ఒక రాత్రంతా స్మసానంలో గడపాల్సివస్తే
వర్మ : నేను తీసిన హార్రర్  సినిమాలను చుస్తూ గడిపేస్తా 

నేను : ఆంత్రమాలి ఊర్మిళా మటోండ్కర్‌లను ఎందుకు పక్కన పెట్టారు ... మీ సినిమాల్లో వాళ్ళు రెగ్యులర్‌గా కనిపిస్తారు కదా !?
వర్మ : చూపించడానికి వాళ్ళలో ఇంకేం లేదు  
  
నేను : దేవున్ని నమ్ముతారా లేక దెయ్యాన్ని నమ్ముతారా ?
వర్మ : దేవుళ్ళుంటే దెయ్యాలుంటాయ్ ... దెయ్యాలుంటే దేవుళ్ళుంటారు. దెయ్యాలు లేకపోతే దేవుళ్ళకు పనుండదు 


నేను : ఆంధ్రప్రదేశ్లో ఎన్.టి.ఆర్  దేవుడితో సమానం ... అటువంటి వ్యక్తిని రక్తచరిత్ర లో విలన్ గా ఎందుకు చూపించారు !
వర్మ : (సీరియస్ గా  మొహం పెట్టి... )  ఎన్.టి.ఆర్ అంటే నాకు అసూయ  ... దానికి కారణం శ్రీదేవే ... నాకు శ్రీదేవంటే ఇష్టం ... శ్రీదేవికి ఎన్.టి.ఆర్ అంటే ఇష్టం ... వాళ్ళిద్దరిదీ హిట్ పెయిర్ ... శ్రీదేవి పక్కన ఎన్.టి. ఆర్ ను ఊహించుకోలేకపోతున్నాను ... ఆ కసి తీర్చుకోవడానికే అలా చూపించా .

Saturday, October 23, 2010

Friday, October 22, 2010

The Perfect Indian Family

గమనిక : రేపు The Mummy Returns చూడండి

Monday, October 11, 2010

నేను మానసికరోగిని కాను : రాంగోపాల్ వర్మ

 నేను అక్టోబర్ 4 న పోస్ట్ చేసిన " రాంగోపాల్ వర్మా !? ... అతనో మానసికరోగి " అనే ఆర్టికల్ కు రాము సమాధానం సాక్షి ఫన్ డే (10-10-2010)లో వచ్చింది. సాధరణంగా నాకు సాక్షి చూసే అలవాటులేదు ... అనుకోకుండా ఒక స్నేహితుడి ఇంట్లో పేపరు తిరగేస్తుంటే ఇది నాకంట పడింది .దానిని యధాతధంగా దిగువ ఇస్తున్నాను ... అందులో చాలా విషయాలు నేను రాసిన విషయాలతో ఏకీభవిస్తూనే తనదైన శైలిలో సమాధానమిచ్చాడు రాము  అని నా భావన.తాను మానసికరోగిని కానని ... కాకపోతే నా ప్రపంచంలో నేనుంటానని రాము ఉద్దేశ్యం. నా ఆర్టికల్ కు రామూ స్పందిస్తాడని నేను ఊహించలేదు ...కానీ స్పందిస్తే బాగుండును అని అనుకున్నాను .తనదైన బాణీలో స్పందించినందుకు రామూకి కృతజ్ఞతలు.
   
 - థాంక్స్ టు రాము

Monday, October 4, 2010

రాంగోపాల్ వర్మా !? ... అతనో మానసికరోగి

రాంగోపాల్ వర్మని జాగ్రత్తగా గమనించేవాళ్ళకి కలిగే అభిప్రాయమిది. తల - తోక లేని స్టేట్మెంట్లు ఇవ్వడం ...  సినిమాలకు పైశాచిక ఇతివృత్తాలను కథలుగా ఎంచుకోవడం  ... ఒంటరిగా కూర్చుని తెరిచివున్న కిటికీలోంచి గంటలు తరబడి గాల్లోకి చూస్తూ ఉండిపోవడం ... ఎవరితోనూ సరైన సంబంధాలు నెరపకపోవడం ... విపరీతమైన ఇగో ప్రదర్శించడం ... ఇవన్నీ వర్మ లక్షణాలు. నువ్వొక మానసికరోగివి అంటే ... రాము ఒప్పుకోడు ... పైగా డబాయిస్తాడు ... ఈ రోజుల్లో రోగం లేనిదెవరికి ? - అని ఎదురు ప్రశ్నిస్తాడు. ఎప్పుడూ తన తప్పును ఒప్పుకోడు . మీ సినిమా ప్లాపయ్యింది కదా అంటే ... అదేం కాదు జనానికి సినిమా చూడడం చేతకాలేదు అంతే అంటాడు. మీరు తీసే పిచ్చి సినిమాలు జనానికి నచ్చాలని రూలేం లేదు కదా ?- అంటే ... చిరాగ్గా మొహం పెట్టి నా సినిమాలన్నీ Advanced గా ఉంటాయ్ ... వాటిని అర్ధం చేసుకోవాలంటే జనానికి చాలా మానసిక పరిణితి అవసరం, అందుకు చాలా ఏళ్ళు పడుతుంది అంటాడు. నా Freqency కి ప్రేక్షకుల Freqency match  కావడం లేదు ... అందుకే ప్లాపవుతున్నాయేమో అంటాడు. జనం Freqency కి match అయ్యే సినిమాలు తీయొచ్చుకదా అంటే ... నేనెవరి కోసమో సినిమాలు తీయను ... నాకోసమే తీస్తాను అంటాడు. నా సినిమా ఆడినా ఆడకపోయినా నాకేం పర్లేదు ... బొంబాయి చుట్టుపక్కల నా సినిమాలంటే పడి సచ్చే జనం ఉన్నారు. వాళ్ళకు నచ్చితే చాలు నా డబ్బులు నాకొస్తాయ్ అంటాడు . సినిమాలు తనకోసమే అయినప్పుడు  తనే ఇంట్లో ఒంటరిగా కూర్చుని గోళ్ళు కొరుక్కుంటూ హోం థియేటర్లో చూసుకోవచ్చుకదా ? జనం మీదకి వదలడమెందుకు ? పోనీ తీసే సినిమాలైనా వినోదాత్మకమైనవీ సందేశాత్మకమైనవీ తీయొచ్చుకదా అంటే ... నేను చెప్పే తొక్కలో సందేశం కోసం ఎవడూ నా సినిమాకి రాడు అంటాడు.
         కొత్తదనం అంటే అసలేమాత్రం నచ్చని మనిషి రాము . తీసిన సినిమాలనే తిప్పితిప్పి రకరకాలుగా తీస్తుంటాడు ... అవే థీం లు, అవే కథలు, అవే స్క్రీన్ ప్లేలు , అవే లైటింగ్ ఎఫెక్టులు, అవే చేజింగులు  ... వర్మ సినిమాల్లో రెగ్యులర్గా కనిపించే అంశాలు . ప్రతిసారీ పాత చింతకాయ పచ్చడేనా? వెరైటీ వద్దూ ? అంటే ... హం ఆప్ కే హై కౌన్ లాంటి సినిమాలు తీయడం నావల్ల కాదు అంటాడు. నిజజీవితంలో అలాంటి సన్నివేశాలు ఉండవు అని తప్పించుకుంటాడు . పోనీ పెద్ద హీరోలు, పేరున్న హీరోలతో సినిమాలు తీయొచ్చుకదా అంటే ... మనోడికి ఇగో ప్రాబ్లం. నేనెళ్ళి వాళ్ళనడిగేదేంటి ... వాళ్ళే వచ్చి నన్నడాగాలి - నాకో సినిమా చేసిపెట్టమని అంటాడు. వాళ్ళెందుకు అడుగుతారు ... వాళ్ళకు ఈయనకంటే ఇగో కదా !.  ఇలాగే పదేళ్ళ క్రితం పాపం అశ్వనీదత్ వర్మను, చిరంజీవిని కలపాలని రెండు సినిమాలు ప్లాన్ చేసాడు. ఒకటి మృత్యుంజయుడు రెండోది మహాత్మా గాంధీ ఆటోబయోగ్రఫీ. మొదటి దాన్లో చిరు హీరో అయితే రాము దర్శకుడు, హీరోయిన్ టాబు. రెండో దాన్లో హీరో చిరంజీవి ఫేన్ . దానికే గెడ్డం చక్రవర్తి హీరో , దర్శకుడు . ఎక్కడ తేడా వచ్చిందో ఏంటో రెండూ మధ్యలో ఆగిపోయాయి. ఆ మొదటి సినిమాలోని రెండు పాటల్నే చూడాలని ఉంది సినిమాకి వాడుకున్నారు. తనకన్నా పెద్ద ఇమేజ్ ఉన్నవాళ్ళతో కలవడానికి రామూ ఒప్పుకోడు. వాళ్ళు ఎక్కడ తనను డామినేట్ చేస్తారోనని భయం ఇదే జబ్బు అతని స్కూల్ నుండి వచ్చిన వాళ్ళకి కూడా వర్తిస్తుంది. పలానా హీరోతో మీరు సినిమా ఎందుకు చెయ్యడంలేదు అంటే రామూ ఏమంటాడో తెలుసా ... నా కథ ఎవర్ని డిమాండ్ చేస్తే వాళ్ళతోనే సినిమా తీస్తాను అని తెలివిగా తప్పించుకుంటాడు. నా దృష్టిలో అది తెలివి అనిపించుకోదు ...  Escapism అనిపించుకుంటుంది. అంతేకాదు తన శిష్యులుగా తనకంటే తెలివైన వాళ్ళను సెలెక్ట్ చేసుకోడు ... వాళ్ళు తనను డామినేట్ చేస్తారని భయం ... పైగా తెలివైన లీడర్ ఎప్పుడూ తనకంటే తెలివైన వాళ్ళను టీం మెంబర్లుగా పెట్టుకోకూడదు అనుకుంటాడు రాము. నా దృష్టిలో దర్శకుడంటే ఎటువంటి ఇమేజున్న హీరోనైనా డీల్ చేయగలగాలి.  రామూతో మాట్లాడేటప్పుడు తప్పకుండా వచ్చే ప్రస్తావన శ్రీదేవి విషయం. శ్రీదేవితో తన వన్ - సైడ్ ప్రేమ గురించి చెప్పకుండా ఉండడు . కేవలం శ్రీదేవి కోసమే వందల సార్లు చూసిన సినిమాలు ఎన్నో ఉన్నాయంటాడు వర్మ. అంత ప్రేమించినవాడు అప్పట్లోనే ఆమెతో చెప్పి ఉండాల్సింది ... తాడో పేడో తేలిపోను.  అలా చేయకుండా పెళ్ళైన తరువాత కూడా ప్రేమిస్తున్నాను ... ఒప్పుకుంటే పెళ్ళి చేసుకుంటాను అంటే ... అది పద్దతి కాదు కదా !?. అప్పట్లోనే శ్రీదేవిని ప్రేమించిన వాళ్ళు ఆంధ్రదేశంలో గుట్టలు గుట్టలుగా ఉండేవాళ్ళు (ఇప్పుడు కూడా ఉన్నారనుకోండి). ఆ మాట కొస్తే శ్రీదేవిని ప్రేమించనివాడెవడు? సంతోషంగా సంసార పక్షంగా సంసారం చేసుకుంటున్న శ్రీదేవితో ఇలాగేనా ప్రవర్తించేది . పాపం బోనీ కపూర్ గతేం కావాలి. రామూ ఎప్పుడూ తన వ్యక్తిగత విషయాలు చెప్పడు. పెళ్ళైందో లేదో తెలీదు. ఒకవేళ అయ్యుంటే పెళ్ళాం బిడ్డలు ఈయనతో ఎలా వేగుతున్నారో ఏంటో ? ఇప్పుడు చెప్పండి ...  రామూని ఏమనాలో ?                              

Friday, October 1, 2010

రోబో దర్శకుడు శంకర్ విజయరహస్యం చెబుతా ... తలా ఒక్కింటికి మూడులక్షలు ఫీజు

అవును ... అక్షరాలా మీరు విన్నది నిజమే. శంకర్ ను అనుకరించాలని ఆయనలా భారీ విజయాలను సాధించాలని మీడియాలో వెలిగిపోవాలని ఏ దర్శకుడికి మాత్ర వుండదు చెప్పండి. ఇప్పటికే ఆయనను అనుకరించి చేతులు కాల్చుకున్న దర్శకులు చాలామంది . శంకర్ లా విజయాలు నమోదు చేయడం అందరికీ సాధ్యం కాదు ... కానీ నేను చెప్పిన విజయరహస్యం విన్న తరువాత దర్శకులకు విజయాల శాతం పెరుగుతుంది . ఈ రహస్యం ఏ సీనియర్ దర్శకుడు కూడా తన అసిస్టెంట్లకు చెప్పిఉండడు. ఎందుకంటే అది ఆ దర్శకుడికి కూడా తెలియదు కాబట్టి . ఒకవేళ తెలిసినా ఎక్కడ తనకు పోటీ వస్తాడోనని ఖచ్చితంగా చెప్పడు. వివరాలు కావలసిన వారు నా ఈ- మెయిల్కు రాయవచ్చు. సినీ పరిశ్రమలోని కాకలు తీరిన దర్శకులు, విజయాల కోసం మొహం వాచిన వాళ్ళు , ఔత్సాహిక దర్శకులు ఎవరైనా సరే సంప్రదించవచ్చు . మిగతా వివరాలకోసం ఇదే బ్లాగులో క్రమం తప్పకుండా చదువుకోవచ్చు.